తల్లి ఫోటోలనే నెట్‌లో పెట్టాడు!
మన ప్రమేయం లేకపోయినా మన ఫొటోలకు మరెవరి శరీరాన్నో తగిలించి నెట్‌లో ఉంచి అవమానం పాలు చేస్తే? ‘నా మాట వినకపోయావా... నీ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టేస్తా జాగ్రత్త’ అంటూ ఆగంతకుడెవరో బెదిరిస్తుంటే? వాట్సప్‌కి అశ్లీల చిత్రాలు పంపించి మనసుని కకావికలం చేస్తుంటే... ఎవ్వరికి చెప్పకుండా ఏడుస్తూ కూర్చోవద్దు.. తప్పుచేసిన వారి భరతం పట్టొచ్చు.. అంటున్నారు సైబర్‌ నేర పరిశోధనా నిపుణురాలు ధన్యామేనన్‌. మహిళలు అరుదుగా ప్రవేశించే ఈ రంగంలోకి వచ్చి.. పదేహేనేళ్లుగా తనదైన ముద్ర వేస్తున్నారీమె.
సాధారణంగా మా దగ్గరకు వచ్చే కేసులు రెండు రకాలుగా ఉంటాయి. సంస్థల్లో జరిగే సైబర్‌ నేరాలు ఒక రకమైతే.. వ్యక్తిగతంగా ఎదుర్కొనే సైబర్‌ అవమానాలూ, బెదిరింపులూ, నేరాలు రెండోరకం. మేం మా సంస్థ ‘అవెంజో సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్‌’ద్వారా ఆ నేరస్తుల్ని గుర్తిస్తాం. పోలీసులకూ నేర పరిశోధనలో మా సాయం అందిస్తాం. మహిళలు చాలా తక్కువ మందిఉండే ఈ రంగంలోకి నేను రావడానికి కారణం నాకు ఎదురైన ఓ సంఘటనే. నేను పుట్టింది కేరళలోని త్రిసూర్‌లో. నాన్న బ్యాంకు ఉద్యోగి కావడంతో నా బాల్యం కొన్నాళ్లపాటూ రాజమండ్రిలో గడిచింది. ఆ సమయంలోనే తెలుగు, కూచిపూడి నేర్చుకున్నా. తర్వాత కేరళ వెళ్లిపోయి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో కొన్నాళ్లు ఐటీ ఉద్యోగిగా పనిచేశా. ఓ రోజు నా స్నేహితురాలి నుంచి నాకో ఆహ్వానం. ‘నేను సైబర్‌ చట్టాలకు సంబంధించి ఓ సెమినార్‌ తీసుకుంటున్నా. కనీసం వందమందైనా వస్తారనుకున్నా. కానీ ఐదుగురు కూడా రావడం లేదని తెలిసింది. ప్లీజ్‌ నువ్వయినా వస్తే పరువు దక్కుతుంది’ అంటూ పట్టుబట్టింది. కేవలం తన కోసమే ఆ కార్యక్రమానికి వెళ్లా. అది పూర్తయ్యాక అక్కడికి వచ్చిన వారికి ఓ పరీక్షా పత్రంలాంటిది ఇచ్చి రాయమన్నారు. నాకు తెలిసిన సమాధానాలు ఏవో రాసి వచ్చేశాను. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయా. కానీ కొన్ని రోజులయ్యాక మా ఇంటికో ఉత్తరం వచ్చింది. మీరు సైబర్‌ చట్టాలకు సంబంధించి పైచదువులు చదవడానికి అర్హులు అనేది దాని సారాంశం. ఆ ఉత్తరాన్ని నాకన్నా ముందే మా పెదనాన్న చదివారు. ఆయన సుప్రీం కోర్టు న్యాయవాది పీబీ మేనన్‌. అప్పటికే ఎన్నో సార్లు నన్ను న్యాయవిద్య చదమని అనేవారు. ఆ మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఉత్తరం చదివాక ‘చూశావా నేనన్నదే నిజం. నువ్వు సైబర్‌ లా చదవాల్సిందే’ అంటూ దరఖాస్తు నింపి పంపారు. అలా ఇటువైపు వచ్చా.
నేర్చుకున్నది చెప్పేదాన్ని.. నేను సైబర్‌ లా ఎంచుకోవడానికి కేవలం రెండేళ్ల క్రితమే సైబర్‌ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో ఈ కోర్సుకి సంబంధించి పెద్దగా పుస్తకాలు కానీ పాఠాలు చెప్పే అధ్యాపకులు కానీ లేరు. పుణెలోని ఏషియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సైబర్‌లాలో చదువుకున్నా. ఏడాది కోర్సు. ఒకే ఒక్క బోధకురాలు. మూడు నెలల అయ్యేటప్పటికీ నా జూనియర్లకి నేనే పాఠాలు చెప్పేదాన్ని. మా మేడమ్‌ దగ్గర నేను నేర్చుకోవడం మరుసటి రోజు వాటినే పాఠాలుగా చెప్పడం... ఇలా నేను ఏషియన్‌ స్కూల్లో చదువుకుంటూనే టీచర్‌గా మారిపోయా. పోలీసులూ, న్యాయవాదులతోపాటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైబర్‌ చట్టాల గురించి అవగాహన కల్పించేదాన్ని. పోలీసులూ, న్యాయవాదులూ నేర పరిశోధనలో నా సాయం తీసుకునేవారు. అప్పుడే నేనెంచుకోవాల్సిన రంగం ఇదేనని అనిపించింది. అలా 2010లో ‘అవెంజో సైబర్‌ సెక్యూరిటీ సొల్యుషన్స్‌’ పేరుతో ఓ సంస్థని ప్రారంభించా. అప్పటికే ఎన్నో కేసులు శోధించిన అనుభవం ఉండటంతో ఎక్కడా వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రారంభించిన కొత్తల్లో.. వ్యక్తిగతంగా ఎదుర్కొనే సైబర్‌ అవమానాలూ, బెదిరింపులూ, నేరాలే ఎక్కువగా వచ్చేవి. చెప్పాలంటే నెలకు ఎనిమిది కేసులు ఉండేవి. ఇప్పుడు వారానికి రెండొందల కేసుల్ని పరిశోధిస్తున్నాం. ఈ బెదిరింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిలు కూడా కొందరు ఉన్నారు. అలాంటివి విన్నప్పుడు మొదట్లో నిద్రపట్టేది కాదు. అన్నం కూడా తినేదాన్ని కాదు.
ఇక సంస్థలు ఎదుర్కొనే సమస్యలు మరో రకంగా ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా డేటా కోల్పోవడం గురించి ఫిర్యాదులుంటాయి. అయితే మేం పోలీసుల పని చేయం. పోలీసులకు కావాల్సిన సాక్ష్యాలు పోకుండా సహాయసహకారాలు మాత్రమే అందిస్తాం. దేశవ్యాప్తంగానే కాదు ఆసియా దేశాల్లో అనేక కేసులని పరిష్కరించాను. ప్రస్తుతం కేరళలో మాత్రమే నా ఆఫీసు ఉంది. కానీ సమస్యను బట్టి వివిధ ప్రాంతాలకు వెళ్లి సాంకేతిక సాయం అందించి వస్తుంటా.
అతన్ని గుర్తించాం: మా పని... సైబర్‌ నేరాలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన సాక్ష్యాలను గుర్తించడం ఒక్కటే కాదు.. పోలీసులు వచ్చేవరకూ అవి పోకుండా చూస్తాం. కొందరు చేసిన నేరం తెలియకుండా మెమోరీకార్డు తీసేస్తారు. మరి కొందరు ముందు వీడియోలు పెట్టి.. తరవాత తొలగించేస్తారు. ఆ తీరు మేం కనిపెట్టేస్తాం. దాన్ని బట్టి ఎవరు తప్పు చేశారనేది తెలుస్తుంది. కొన్నాళ్లక్రితం మా దగ్గరకు ఓ కేసు వచ్చింది. ఓ సంస్థ ఉత్పత్తిని తయారుచేసి రేపు విడుదల చేస్తుందనగా ఈ రోజే దాని ప్రత్యర్థి సంస్థ దాన్ని విడుదల చేసేసింది. ఆరా తీస్తే ఆ సంస్థలోని వ్యక్తి సమాచారాన్ని ప్రత్యర్థి సంస్థకు చేరవేశాడు. అతన్ని గుర్తించేందుకు ఉద్యోగుల ఫోన్లు పరిశీలించాం. చివరికి ఎవరనేది తెలిసిపోయింది. రోజూ సమస్యలూ, పరిష్కారాలూ.. ఇలా క్షణం తీరిక లేకుండా ఉంటుంది మా పని. ప్రస్తుతం మా దగ్గర ఇరవై మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటివరకూ మొత్తంగా ఐదారువేల కేసుల్లో మా వంతు సాయం అందించాం. రోజూ ఈ సమస్యలూ, పరిశోధనలూ.. ఇలా క్షణం తీరిక లేకుండా గడిపే నాకు నాట్యమే కాస్త వూరట ఇస్తుంది. కుదిరినప్పుడల్లా కూచిపూడి, మోహినీ అట్టం ప్రదర్శనలు ఇస్తుంటా. ఇప్పుడు హైదరాబాద్‌కు కూడా నాట్య ప్రదర్శన కోసమే వచ్చా. కుదిరినప్పుడల్లా పిల్లలకోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పిల్లలు ఫోన్లకు బానిస కాకుండా ఉండేందుకు మా వంతుగా ప్రయత్నిస్తున్నాం. కొందరు తల్లిదండ్రులకు ఈ విషయంలో కౌన్సెలింగ్‌కూడా ఇప్పిస్తున్నాం.
ఇంటిదొంగని గుర్తించాం..
కావిడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆ ఇంటి యజమాని ఆమెని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె తిరగబడింది. దానికి ఆ యజమాని చెప్పిన సమాధానం విని ఆమె భయపడింది. ‘నటించకు. నీ గురించి నాకు తెలియదా? నెట్‌లో ఎక్కడ చూసినా నీ ఫొటోలే! చూస్తావా’ అంటూ నెట్‌లో చూపించాడు. నిజంగా ఆమె ఫొటోలే. చివరికి ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలు కూడా! పోలీసులకు ఫిర్యాదు ఇస్తే అందరికీ తెలిసిపోతుందేమోనని భయం. మరో వైపు పరువు గురించిన బాధ. ఎక్కడో రేడియోలో ఆమె నా గురించి విని, వాళ్లనీవీళ్లనీ అడిగి చివరికి నా ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని కలిసింది. నేను ఓదార్చి... ఆ విషయం నేనొచ్చేంత వరకూ ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పి వాళ్ల వూరు బయలుదేరా. ఆ వీడియోలు పరిశీలిస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్లే ఆ పని చేశారని అర్థమయ్యింది. ఆమె భర్త గుమాస్తా. అతను పెద్దగా చదవుకోలేదు. ఫోను వాడతాడు కానీ వీడియోలు అప్‌లోడ్‌ చేసే పరిజ్ఞానం లేదు. కొడుక్కి పదమూడేళ్లు. వాడిని చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే వాడి చేతిలో కొత్త మోడల్‌ ఫోను. ఖరీదైన బట్టలూ, కొత్త బండీ. ఏం చదువుతున్నాడని అడిగాను. ‘చాలా తెలివైన వాడమ్మా. చదువుతూనే నెట్‌లో పనిచేస్తాడు’ అంది బాధితురాలు. నా అనుమానం బలపడింది. కానీ వాడి ఫోను చూస్తే అందులో ఎలాంటి వీడియోలు లేవు. అంటే నేను రావడానికి ముందే జాగ్రత్త పడ్డాడన్నమాట. బ్యాంకు ఖాతాని పరిశీలిస్తే... అరవై వేల రూపాయల వరకూ ఉంది. ఆ వయసుకు అంత డబ్బు ఏ ఖాతా నుంచి వచ్చిందో పరిశీలించా. ఓ వీడియో పార్లర్‌ నుంచి వచ్చింది. ఆ పార్లర్‌ ఈ పిల్లాడు చదివే స్కూల్‌కి పక్కనే ఉంటుంది. అంటే వీడియోలు తీసి అమ్మడం ద్వారా సంపాదిస్తున్నాడు. పోలీసులకు వివరాలు అందించా. పిల్లాడిని ప్రశ్నించే సరికి నిజం చెప్పాడు. వాళ్ల నాన్న ఫోనులో అశ్లీల చిత్రాలు చూడ్డం చూసి అతను ఇలా చేశాడు. చివరికి కన్నతల్లి ఫొటోలే తీసి అమ్మాడు. అలా ఆ ఇంటిదొంగని గుర్తించా.
మరో కేసు.. అతను ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి. తల్లిదండ్రులూ, అక్కా డాక్టర్లే. వాళ్ల అక్కకు సంబంధించిన వ్యక్తిగత వీడియో ఒకటి నెట్‌లో కనిపించింది. ఆ వివరాలు నా దగ్గరకు వచ్చినప్పుడు.. నేనూ దాన్ని చూశా. ఇంటి వాతావరణం స్పష్టంగా కనిపించింది. అంటే ఇంట్లోవాళ్లే ఎవరో చేసి ఉంటారని అర్థమైంది. ఇంట్లో ఎక్కడయినా కెమెరా పెట్టారేమో గమనించా. చివరకు బాత్రూంలో కనిపించింది. పోలీసుల ద్వారా ఆరాతీయిస్తే.. ఈ పని ఆ తమ్ముడిదేనని అర్థమైంది. ఇదే కాదు.. మా స్కూల్‌ పిల్లలు పాడవుతున్నారు, మా అమ్మాయి ఫొటోలు నెట్‌లోకి ఎలా వచ్చాయో తెలియదు అంటూ అనేక కేసులు మా దగ్గరకు పరిశీలనకు వస్తుంటాయి.
- శ్రీసత్యవాణి

Comments

Popular posts from this blog

ఆంజనేయుడికి వెండి గద సమర్పించిన హరీశ్ రావు

ప్రజల్లోకి పవిత్ర నరేష్ #pavithranaresh #naresh #telugu cinema

దుబాయ్ లో జాగ్రత్త. . యుఎఇ లో కొత్త చట్టాలు